Loading...
మాలధారణ స్వాములకు దసరా పండుగ నుండి మకర జ్యోతి వరకు అన్నప్రసాద (మధ్యాహ్నం సద్ది) వితరణ జరుగుతుంది. అలాగే మండల మహోత్సవం ప్రారంభం నుండి అనగా 17-11-2024 నుండి మకరజ్యోతి వరకు సాయంత్రం బిక్ష వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు శ్రీ అయ్యప్ప స్వామి వారికి ఉదయం అభిషేకాలు, సాయంత్రం పూలాభిషేకం , సప్తహారతులు, ఊయల సేవ అనంతరం పవళింపు సేవ జరుగుతుంది. తదుపరి తీర్ధ ప్రసాద వితరణ జరుగును.

About Us

                         శ్రీఅయ్యప్ప స్వామి వారి దేవస్థానం

        ఓంకార తీర్ధం (ఓగేరు వాగు) కి దక్షిణ దిశన చిన్నపసుమర్రు

                       చిలకలూరిపేట 522616 పల్నాడు జిల్లా
                       మన దేవాలయం యొక్క స్థల పురాణం 


         మన దేవాలయం పూర్వాశ్రమంలో చినపసుమర్రు అగ్రహారం గా పిలవబడేది. ఆ రోజులలో ఇచ్చట అనేకమైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలు నివాసమేర్పరుచుకుని ఉంటూ ఇచ్చట అనేక యజ్ఞ యాగాధి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు.

          ఆ రోజులలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ ప్రాంతంలో మన దేవాలయ ప్రాంతంలో సంధ్య వార్చుకొని విశ్రమించి తిరిగి బయలుదేరే సమయంలో ఇది ఒక నాటికి మహా పుణ్యక్షేత్రం అవుతుంది అని చెప్పి ఉన్నారు (పూర్వీకుల ద్వారా తెలిసిన సమాచారం).

         అలాగే మన దేవాలయానికి ఉత్తరం వైపున తూర్పు వాహినిగా ఓంకార తీర్థం వ్యవహారికంలో ఓగేరు వాగు అని పిలవబడేటువంటి ఓంకార తీర్థం ప్రవహిస్తూ ఉన్నది. ఇది ప్రశస్తమైనటువంటి విషయం అలాగే మన దేవాలయంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి వారు స్పటిక శివలింగరూపుడు. ఈ స్పటిక శివలింగం యొక్క విశిష్టత ఏమనగా ఇది సుత్తి సేనములతో చెక్కబడినది కాదు . ఏ శిల్పకారుడు దీనిని మలచి ఉండలేదు స్వతఃసిద్ధముగా హిమాలయ పర్వత సానువులలో ఒకానొక గురువుగారి చేతుల మీదగా చాతుర్మాస వ్రతదీక్ష సమయంలో వారి యొక్క దివ్య హస్తముల  మీదగా అనుగ్రహించబడినది కావున ఇది స్వయంభు గా భావించవచ్చును.

         అదేవిధంగా ఈ దేవాలయం నందు నాగశక్తి మరియు అమ్మవారు కొలువై ఉన్నారు అందుకు అనేక దృష్టాంతములు మేము పొంది ఉన్నాము మరియు ఏకశిలా నిర్మితమైనటువంటి పదునెట్టాంబడి అనగా 18 మెట్లు గత 18 సంవత్సరములుగా మన దేవాలయంలో అనేకమంది భక్తులు తమ యొక్క కోర్కెలు నెరవేర్చబడి మిక్కిలి సంతోషము నందుచు ఈ క్షేత్రమును సిద్ధ క్షేత్రముగా భావించుచు ప్రజలచే భక్తులచే సిద్ధ క్షేత్రముగా పిలవబడుచున్నది.

            మన దేవాలయం హరిహర క్షేత్రంగా సప్తదేవాలయాల సమాహారంగా ప్రసిద్ధి చెందింది 

       ప్రతి సంవత్సరం మండలమహోత్సవం లో భాగంగా 41 రోజులు శ్రీలక్ష్మి గణపతి హోమం నిర్వహించబడుతుంది.

          విశేషంగా అన్నార్తుల ఆకలి దప్పులు తీర్చుటకై మన దేవాలయము నందు కరోనా సమయంలో కూడా వేలాది మంది భక్తులకు ఆహార ఏర్పాట్లు చేయడం జరిగినది. ప్రతి బుధవారము కూడా మన దేవాలయంలో అన్న ప్రసాద వినియోగం జరుగుచున్నది అలాగే మీది మిక్కిలి విశేషముగా దీక్షదారులందరకు శతాధికమైనటువంటి రోజుల్లో దసరా నుండి సంక్రాంతి వరకు మన దేవాలయంలో మధ్యాహ్నం భోజనం (సద్ది) సాయంత్రం అల్పాహారం (బిక్ష) ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

         భక్తులకు వారి యొక్క ఈతిబాదలు తొలగుటకు సృష్టి అంతయు చక్కగా కళకళలాడుతూ సకలజనులు కూడా సకల సౌభాగ్యాలతో ఉండుటకు అవసరమవు భగవత్ నిత్యార్చనలు నిత్య కైంకర్యములు నిత్యము కూడా నిర్వహించబడుచున్నవి.

           జాతీయరహదారికి అనుకుని రాకపోకలకు అనుకూలంగా ఉండే మన దేవాలయ ప్రాంగణం భక్తులకు దీక్షాదారులకు అనువైన ప్రదేశం గా చెప్పబడుచున్నది.